
త్వరలో జరగనున్న పాకిస్తాన్ ఎన్నికల్లో హఫీజ్ తల్హా సయీద్ అనే వ్యక్తి లాహోర్ నుంచి పోటీ చేస్తున్నాడు. అతను భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ కొడుకు. తల్హా సయీద్‌ను భారతదేశం 2022 ఏప్రిల్ 8న ఉగ్రవాదిగా ప్రకటించింది. అతన్ని బ్లాక్‌లిస్ట్ చేయాలంటూ 2022 అక్టోబర్ 19న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందు ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు అడ్డం కొట్టింది ఎవరో తెలుసా… చైనా. ఐక్యరాజ్యసమితిలో తనకున్న వీటో అధికారాన్ని ప్రయోగించి చైనా భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యహరించే పాకిస్తాన్‌కు అడుగడుగునా సహకరిస్తూ, పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి తోడ్పడుతూ, వారిని నిలువరించేందుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసే ప్రయత్నాలకు గండికొడుతూ…. చైనా మన దేశానికి కలగజేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి ఘటనల కాలక్రమాన్ని, చైనా రక్షించిన పాకిస్తానీ ఉగ్రవాదుల కథనూ ఒక్కసారి చూద్దాం.
ఐక్యరాజ్యసమితిలో ఇతర దేశాల మద్దతు భారత్‌కు లభించినప్పటికీ, మన దేశంపై దాడులకు పాల్పడిన పాకిస్తానీ ఉగ్రవాదులను పట్టుకోడానికి భారత్ చేసిన ప్రతీ ప్రయత్నానికీ చైనా భద్రతామండలిలోనే అడ్డుపడింది. దానికి కారణాలు భారత్‌పై చైనాకున్న అకారణ ద్వేషం, పాకిస్తాన్‌పై ఉన్న అవ్యాజమైన అనురాగం మాత్రమే కాదు… ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనాకు శాశ్వత సభ్యదేశంగా ఉన్న వీటో అధికారం కూడా కారణమే.
భారతదేశం దురదృష్టం ఏమిటో తెలుసా…. భద్రతామండలిలో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశంగా భారత్‌కు అవకాశం వస్తే, దాన్ని చేజేతులారా చైనాకు వెండిపళ్ళెంలో పెట్టి మరీ అందించింది ఎవరో తెలుసా… హిందీ చీనీ భాయీభాయీ అంటూ పంచశీల సూత్రాలు ప్రతిపాదించిన శాంతిదూత మన ప్రథమ ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూయే. అప్పుడే పంచశీల సీలలు ఊడగొట్టి మన దేశంపై యుద్ధం ప్రకటించిన చైనా, నాటినుంచీ పాకిస్తాన్‌కు అండగా నిలుస్తూనే ఉంది, ఆఖరికి పాకిస్తాన్ భారతదేశంపై ప్రయోగిస్తున్న ఉగ్రవాదానికి ఐక్యరాజ్యసమితిలో సైతం మద్దతు పలుకుతూనే ఉంది అదీ సంగతి.





