News

శ్రీవారి భక్తులకు శుభవార్త.. సర్వదర్శనం టోకెన్ల పునఃప్రారంభం..!

330views

తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి.. సర్వ దర్శన టోకెన్లు జారీ చేయగా.. అవి డిసెంబర్ 25న ఉద‌యం 4.27 గంట‌ల‌కే పూర్తయ్యాయి. కాగా.. సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్లలో జనవరి రెండో తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ‌ తేదీ ఉదయం 4 గంటల నుంచి మంజూరు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి దర్శన స్లాట్లు ప్రారంభమవనున్నాయి. ఈ విషయాన్ని గమనించి.. భక్తులు సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది.

ఇదిలా ఉంటే.. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు కూడా.. ఇకపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. హోమం టికెట్‌ కాకుండా రూ.300 అదనంగా చెల్లించిన వారికి సుపథం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును కల్పిస్తామని తెలిపారు.

మరోవైపు.. తిరుపతి వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీసద్గురు త్యాగరాజ స్వామివారి సంగీత మహోత్సవాలు నిర్వహిచనున్నారు. జనవరి 6, 7న సంగీత మహోత్సవం ఉంటుందని.. రామచంద్ర పుష్కరణిలో అంతర్జాతీయ కచేరి జరుగనుంది.