
అయోధ్యలోని రామమందిర మహాప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. విరాళాల పేరుతో భక్తులను దోచుకునే రాకెట్ వెలుగులోకి వచ్చింది. రామాలయానికి విరాళాలు ఇవ్వాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నట్టు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. వీటిలో QR కోడ్ కూడా ఉంటుందని, స్కాన్ చేసి చెల్లించి డబ్బు మోసగాళ్లకు చేరుతుందని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, యూపీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ వెల్లడించారు. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. నిధుల సేకరణ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదని ఆయన నొక్కి చెప్పారు. ఆలయం పేరు మీద డబ్బు వసూలు చేయడానికి నేరగాళ్ల ప్రయత్నాల గురించి ఇటీవల తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.
‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ నిధులను సేకరించడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను హోం మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాను.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అన్నారు.





