
ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయమున్న సంస్థలపై చర్యలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత తీవ్రం చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న పాక్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘తెహ్రిక్-ఇ-హురియత్’ (Tehreek-e-Hurriyat)పై కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. ఇండియా నుంచి జమ్మూకశ్మీర్‌ను విడగొట్టేందుకు, ఇస్లాం లా స్థాపించేందుకు తెహ్రిక్-ఇ-హురియత్ పనిచేస్తోందని, ఇండియా వ్యతిరేక ప్రచారం, జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదానికి ఆ సంస్థ పాల్పడుతోందని గుర్తించామని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చట్టవిరుద్ధ కార్యకలాపా నిరోధక చట్టం (UAPA) 1967 సెక్షన్ 3(1) కింద తెహ్రిక్-ఇ-హురియత్, జమ్మూకశ్మీర్ (Teh)ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ సంస్థకు వేర్పాటువాద నేత సైయద్ అలీ షా గిలానీ గతంలో సారథ్యం వహించారు. గిలానీ మరణంతో ఈ ఉగ్రసంస్థకు మసరత్ అలామ్ భట్ సారధ్యం వహిస్తున్నారు. ఇండియా వ్యతిరేక, పాక్-అనుకూల విష ప్రచారంలో దిట్టగా భట్‌కు పేరుంది. కాగా, పాక్ అనుకూల తెహ్రిక్-ఇ-హురియత్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ట్వీట్‌లో తెలిపారు. 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఇండియా వ్యతిరేక ప్రచారానికి పాల్పడినట్టు గుర్తిస్తే వాటిని బలంగా తిప్పికొడతామని చెప్పారు. కాగా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ముస్లింలీగ్ జమ్మూకశ్మీర్-మసరత్ అలామ్ వర్గం (ఎంఎల్‌జేకే-ఎంఏ)పై కూడా కేంద్ర హోం శాఖ ఈనెల 27న నిషేధం విధించింది.





