
రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్య మత వ్యాప్తి, ప్రచారాలకు సంబంధించిన వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులు, కూడా క్రైస్తవ మత ప్రచారంలో, ప్రార్థనలలో పాల్గొన్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలోని ఆదర్శ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్జిబా పాఠశాలలో విద్యార్ధులతో బలవంతంగా క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో వివాదం నెలకొంది. క్రిస్టియన్ అయిన ఉపాధ్యాయురాలు డిసెంబర్ 20న పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా, హెప్జిబా క్రైస్తవ మతం గురించి ప్రసంగిస్తూ క్రైస్తవ మతంలోకి మారమని విద్యార్థులను ఒత్తిడి చేశారు. విద్యార్థులు విషయాన్ని తల్లి దండ్రులతో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చంది. ఇటువంటి చర్యలు విద్యార్థుల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వివాదంపై స్పందించిన హిందూ సంఘాలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు టీచర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల హెప్జిబా ప్రవర్తన సరికాదని, విద్యా సంస్థలో మతపరమైన విషయాలు చేపట్టడం ద్వారా నియమాలను ఉల్లంఘించారని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ సంఘాల సభ్యులు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.





