
కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారి మోసే అర్జున ఏనుగుకు ఘనంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో హస్సన్ జిల్లా సకలేశ్పుర తాలుకాలోని దమ్మనకట్టే ప్రాంతంలో నిర్వహించారు. కడసారి అర్జునను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు.
సకలేశ్పుర తాలుకాలోని యసలూరు సమీపంలో సోమవారం ఏనుగులకు రేడియో కాలర్ను అమర్చే ఆపరేషన్లో అర్జున పాల్గొంది. అందులో భాగంగా ఓ అడవి ఏనుగుతో పోరాడతూ అర్జున మృతి చెందింది. అర్జునను చూసుకుంటున్న మావటి ఏనుగుపై పడి బోరున విలపించాడు. దీంతో అతడు అస్వస్థతకు గురికావటం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అర్జున ప్రత్యేకత..
అర్జున ఏనుగు 1968లో జన్మించింది. మైసూర్లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో 22 సార్లు పాల్గొంది. 2012 -2019 మధ్య జరిగిన ఉత్సవాల్లో 750 కిలోల చాముండేశ్వరి దేవి బంగారు అంబారీని మోసింది. దసరా ఉత్సవాల్లోనే కాదు వందలాది ఫారెస్ట్ ఆపరేషన్స్లోనూ పాల్గొంది. ఈ నేపథ్యంలో అర్జున సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మైసూరు దసరా సందర్భంగా అర్జునుడి పేరు మీద మవాటిలకు అవార్డు ఇవ్వాలని కర్ణాటక విధాన పరిషత్ సభ్యుడు దినేష్ గూలిగౌడ డిమాండ్ చేశారు.





