
స్వాతంత్ర్య భారత దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. ఈ ఘటనకు సంబంధించి అల్లర్లు అనే పదాన్ని ఉపయోగించడం తప్పు. అల్లర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వైపుల నుంచి హింస జరిగిందని సూచిస్తుంది. కానీ, 1984 నాటి ఘటన సిక్కు సమాజంపై జరిగిన ఏకపక్ష హింస. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షకులు హత్య చేయడంతో ఆ మరునాడు అంటే నవంబర్1న హత్యాకాండ మొదలైంది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ మారణహోమంలో సాయుధులైన దుండగులు దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులపై దాడులు చేశారు. ఈ హత్యాకాండలో ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది చనిపోయారు. ఢిల్లీతో పాటు కాన్పూర్, బొకారోలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఆ కొద్ది రోజుల హింసాకాండలో దేశవ్యాప్తంగా 3,325 మంది సిక్కులు హత్యకు గురయ్యారు. అయితే అనధికార లెక్కల ప్రకారం దాదాపు 8,000 పై మాటే. సిక్కులు కంటబడితే చాలు అల్లరిమూకలు రెచ్చిపోయి దాడులు చేశాయి. సిక్కుల ప్రార్థనామందిరాలైన గురుద్వారాలు, వారి దుకాణాలు, ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డారు. నాటి ఘటనతో బెంబేలెత్తిపోయి దాదాపు 20వేలమంది సిక్కులు ఢిల్లీ వదిలి వెళ్లిపోయారు. సర్వం కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
ఢిల్లీలో కర్ఫ్యూ విధించారు కానీ అమలు చేసిన దాఖలాలు మాత్రం లేవు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ ఒక్క తూటా కూడా గాల్లోకి పేలలేదు. పెట్రోలింగ్ విస్తృతంగా జరుగుతోందని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో పదే పదే ప్రసారం చేశాయి కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. స్వాతంత్ర్య భారతావనిలో చీకటి అధ్యయంగా నిలిచే ఈ నరమేధం వెనుక నాటి పాలకుల హస్తం సుస్పష్టంగా ఉందనేది నిర్వివాదాంశం. ఇందిరా గాంథీ పార్థివ దేహాన్ని ఉంచిన తీన్ మూర్తి వెలుపల ఉన్న జనం ‘ఖూన్ కా బద్లా ఖూన్’, ‘సర్దార్లు దేశ ద్రోహులు’, ‘సిఖోన్ కో మార్ దో ఔర్ లూట్ లో’, వంటి నినాదాలు చేస్తున్నా ప్రభుత్వ అధికారులు ఎవరు ఆపడానికి ప్రయత్నించలేదు. అప్పటి టెలివిజన్ ప్రసారాల్లో సైతం ఈ నినాదాలను తరచుగా చూపించాయి కానీ సిక్కుల పై జరుగుతున్న దాడులను మాత్రం ప్రసారం చేయలేదు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ కారుపై కూడా దుండగులు దాడి చేశారంటే అల్లర్లు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
సిక్కు వ్యతిరేక అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వప్రయత్నాలు నాటి కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు. ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్, లెఫ్ట్‌నెంట్ జనరల్ జగ్జీత్ సింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్, రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్‌జీత్ సింగ్ ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలిసి అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్‌సింగ్ నుంచి సమాధానం వచ్చింది. ఇందిరాగాంధీ మరణం తర్వాత ప్రధానిగా ఎన్నికైన రాజీవ్‌గాంధీ సైతం సిక్కు అల్లర్లపై నిర్లిప్తతగానే ఉన్నారు. ‘‘ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశంలో కొన్ని అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని తెలుసు, కొన్ని రోజులు భారతదేశం అల్లాడిపోయినట్లు అనిపించింది. కానీ ఒక బలమైన వృక్షం కూలినప్పుడు, దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం’’, అని అల్లర్లను సమర్థించే విధంగా మాట్లాడారు.
సిక్కు అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమీషన్ 2005లో ప్రభుత్వానికి సమర్పించిన చివరి నివేదికలో హింసాత్మక దాడులు జరిగిన తీరును పరిశీలిస్తే బహుశా సిక్కులపై దాడులు కాంగ్రెస్ లేదా వారి మద్దతుదారులు లేదా కొన్ని ఇతర సంస్థలు లేదా సంఘాలచే నిర్వహించబడి ఉండవచ్చని స్పష్టం చేసింది. సిక్కులపై దాడి జరిగి 39 ఏళ్లు గడుస్తున్నా ఇంకా బాధితులకు పూర్తి న్యాయం జరగలేదు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. సిట్‌ను ఏర్పాటు చేసి 300 కేసులను రీఓపెన్ చేసి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు 3,328 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా చెల్లించింది.
ఏదిఏమైనా, 1984లో చోటుచేసుకున్న ఘటన భయంకరమైన జాతీయ విషాదం. అది భారతీయులందరినీ సిగ్గుపడేలా చేసింది. ఈ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరమే లేదు. అయితే ఘటన జరిగి 39 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదనే చెప్పాలి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా, ఈ సువిశాల భారతదేశంలో న్యాయాన్ని మన ప్రజలు అభినందిస్తున్నారనే భావనను కలిగించే ప్రక్రియలను వేగవంతం చేసే మార్గాలను కనుగొనడం మన సమిష్టి బాధ్యత. 1984 నాటి ఘటన జాతీయ మానవ విషాదం. ఈ అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు న్యాయం మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది.





