
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు మళ్లీ వేడెక్కాయి. భారత్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడంపై అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూదిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఈ ఆరోపణలపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ-MEA స్పందిస్తూ.. కెనడాకు దీటుగా బదులిచ్చింది. చట్టాలకు అనుగుణంగానే తాము.. ఒట్టవాకు దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని సూచించినట్లు స్పష్టం చేసింది.
భారత్‌లో 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి ఆరోపణలు చేశారు. ‘‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించకపోతే.. అదనంగా ఉన్న వారికి దౌత్యపరమైన రక్షణ ఎత్తివేస్తామని ఢిల్లీ తెలిపింది. ఇది అసమంజసం, అనూహ్య నిర్ణయం. దౌత్య సంబంధాల కోసం ఏర్పాటు చేసుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే’’ అని మోలానీ ఆరోపించారు.
దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ (MEA).. కెనడా ఆరోపణలను తిప్పికొడుతూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను చూశాం. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేగాక, మన అంతర్గత వ్యవహారాల్లో వారు తరచూ జోక్యం చేసుకుంటున్నారు. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. దీని గురించి గత నెల రోజులుగా కెనడాతో చర్చలు జరిపాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం. సమానత్వ అమలును.. నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.





