
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే.. మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకు కారణం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథామరై ఓ హిందూ ఆలయంలో పూజలు చేయడమే.
తమిళనాడులోని మైలాడుతురై జిల్లా సిర్కాజీలోని సత్తైనాథర్ ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమార్తె సెంథామరై స్టాలిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కళ్లకు అద్దుకుని.. కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో.. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మరి దీన్ని ఏమంటారు..?, ఇది సనాతన ధర్మం కాదా..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మం’ పై వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. . ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఉదయనిధితోపాటు తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు పోలీసులు సహా 14 మందికి నోటీసులు కూడా జారీ చేసింది.




