
విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి)కి సెప్టెంబర్ 30వ తేదీన 60 ఏళ్లు నిండిన సందర్బంగా విహెచ్‌పి సభ్యులు తమిళనాడులోని కన్యాకుమారి భగవతి అమ్మన్ ఆలయం సమీపంలో భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాలని నిర్ణయించారు.
భజరంగ్ దళ్ రాష్ట్ర ఆర్గనైజర్ భీమారాం నేతృత్వంలో ఆలయ సమీపంలో భారత మాత ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని వీహెచ్‌పీ నిర్వహించింది. అయితే, స్థానిక చట్టం ప్రకారం భారత మాత చిత్రపటానికి నివాళులు అర్పించడం నిషేధమని పోలీసులు వీహెచ్‌పీ సభ్యులను అరెస్ట్ చేశారు.
‘భారత మాత విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఇవ్వడానికి అనుమతి లేదు’ అనడంతో పోలీసుల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీహెచ్‌పీ నిర్వాహకులు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో మొత్తం 14 మంది వ్యక్తులను అరెస్టు చేయగా వారు తమ నిర్బంధానికి నిరసనగా నిరాహార దీక్ష ప్రారంభించారు.
విహెచ్‌పితో పాటుగా ఇతర హిందూ సంస్థలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. మత విశ్వాసాలను ఆచరించే వారి స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.




