
దివ్య జనని శారదామాత సందేశాలతో భారతదేశంలో మహిళా శక్తి మరింత జాగృతమైందని శ్రీశారదా మఠం(కోల్‌కతా- దక్షిణేశ్వర్) సహాయ కార్యదర్శి ప్రవ్రాజిక అతంద్ర ప్రాణ మాతాజీ పేర్కొన్నారు. శ్రీశారదా మఠం (గుంటూరు), స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా మహిళా భక్త సమ్మేళనం భీమవరంలో ఆదివారం ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శారదామఠాల మాతాజీలు, రామకృష్ణ, స్వామి వివేకానంద సేవా సమితి ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతంద్ర ప్రాణ మాతాజీ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ‘మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో దోషాలను ఎంచవద్దు. నీ దోషాలను సరిదిద్దుకో.. ఈ లోకంలో పరాయివారెవరూ లేరు. అంతా నీ వారే.’ అంటూ శారదామాత ఇచ్చిన సందేశాలను అందరూ ఆచరించాలన్నారు. శారదామాత పవిత్ర జీవితం, పావన సందేశాలను అనుధ్యానం చేయడమే ఈ సమ్మేళనం లక్ష్యమని వివరించారు. తొలుత స్వామి వివేకానంద సేవా సమితి నుంచి వీవీఎస్ గార్డెన్స్ వరకు పూర్ణకుంభంతో శోభాయాత్ర నిర్వహించారు.




