News

వచ్చే ఏడాదిలో ఆకాంక్షిత తాలూకాలపై సమీక్ష చేస్తా: మోదీ

197views

దిల్లీ: వెనుకబడిన 112 జిల్లాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం ఎంతో మార్పు తెచ్చిందని, దాని ఆధారంగానే 100 ఆకాంక్షిత తాలూకాలను (బ్లాక్‌) ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని, వచ్చే ఏడాది మళ్లీ అధికారంలోని వచ్చాక వాటిలో వచ్చిన మార్పులపై సమీక్ష నిర్వహిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు, నవంబరులో ఈ సమీక్ష చేస్తానని తెలిపారు. ఆకాంక్షిత తాలూకాల్లోని 100 తాలూకాలను ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ‘సంకల్ప్‌ సప్తాహ్‌’ కార్యక్రమాన్ని శనివారం దిల్లీలో ఆయన ప్రారంభించారు. జీ-20 సదస్సుకు వేదికైన భారత్‌ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దాదాపు 3,000 మంది గ్రామ, తాలూకా స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా మరో 2లక్షల మంది ప్రతినిధులు వర్చువల్‌గా హాజరయ్యారు. వారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘112 ఆకాంక్షిత జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవల్ల 25 కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పులొచ్చాయి. ఈ ఆకాంక్షిత జిల్లాలు ఇప్పుడు స్ఫూర్తిమంతమైన జిల్లాలుగా అవతరించాయి. ఈ స్ఫూర్తితో రానున్న ఏడాదిలో 500 ఆకాంక్షిత తాలూకాల్లోని 100 తాలూకాలను స్ఫూర్తిమంతమైనవిగా తీర్చిదిద్దుదాం. అత్యంత వెనుకబడిన 100 తాలూకాలను ఎంపిక చేయాలని వివిధ మంత్రిత్వశాఖలను సూచిస్తున్నా. వాటిని అభివృద్ధిలో జాతీయ సరాసరికి చేరుద్దాం. నాకు నమ్మకముంది. 2024 అక్టోబరు, నవంబరు నాటికి వాటిపై సమీక్ష చేస్తా. అప్పుడు మళ్లీ మీతో మాట్లాడతా’ అని ప్రధాని పేర్కొన్నారు.

3 నుంచి సప్తాహ్‌
జాతీయ స్థాయిలో ఆకాంక్షిత తాలూకాల కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 7వ తేదీన ప్రధాని ప్రారంభించారు. 329 జిల్లాల్లోని 500 తాలూకాలను దీనికి ఎంపిక చేశారు. అందులో 100 తాలూకాలను మళ్లీ ఎంపికచేసి అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని సంకల్ప్‌ సప్తాహ్‌ను చేపట్టారు. అక్టోబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఈ సప్తాహ్‌ జరగనుంది. ఈ వారంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలనేది లక్ష్యం. మొదటి 6 రోజుల్లో సంపూర్ణ స్వాస్థ్య, సపోషిత్‌ పరివార్‌, స్వచ్ఛత, కృషి, శిక్ష, సమృద్ధి దివస్‌ను చేపడతారు. ఆఖరి రోజైన 9న వారంలో చేపట్టిన అభివృద్ధి పనుల సంబరం జరగనుంది. దీనికి సంకల్ప్‌ సప్తాహ్‌ సమావేశ్‌ సమారోహ్‌ అని పేరు పెట్టారు.