News

ఏబీవీపీ సాధించిన విజయాలే యువత ఆలోచనా ధోరణికి నిదర్శనం

0views

యువత నేతృత్వంలో సామాజిక మార్పు తీసుకొస్తామనే పేరుతో ప్రారంభమైన ‘జెన్-జెడ్’ (Gen Z) ఉద్యమాల వెనుక ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండా దాగి ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) జాతీయ సహ సంఘటనా కార్యదర్శి దేవదత్ జోషి ఆరోపించారు. సిమ్లాలో నిర్వహించిన మాజీ ఏబీవీపీ పూర్తికాలిక కార్యకర్త సునీల్ ఉపాధ్యాయ వర్ధంతి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

గతంలో రైతు ఆందోళనలు, సీఏఏ-ఎన్నార్సీ నిరసనలు, రాజ్యాంగ మార్పుపై అపోహలు సృష్టించిన తరహాలోనే… ఇప్పుడు యువతలో ఒక ప్రత్యేక భావజాలాన్ని నూరిపోసేందుకు జెన్-జెడ్ ఉద్యమాన్ని వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తొలుత మార్పు కోరుకునే అనేకమంది యువత ఇందులో చేరినప్పటికీ, రానురాను అసలు సమస్యలను పక్కనపెట్టి కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో దీనిని వాడుకుంటున్నారని గ్రహించి దూరమవుతున్నారని జోషి పేర్కొన్నారు. ఇటీవల పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ (DUSU), కర్ణాటక విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఏబీవీపీ సాధించిన విజయాలే యువత ఆలోచనా ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు.

సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చూపిస్తూ విద్యాసంస్థల్లో అశాంతిని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పంజాబ్‌లోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘నయా కమ్యూనిజం’ (Neo-communism) వ్యాప్తికి జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఏబీవీపీ మూడు స్థాయుల్లో పనిచేస్తోందన్నారు. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను వివరించడం, క్యాంపస్‌లలో ఎదురయ్యే తప్పుడు ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టేలా కార్యకర్తలను సిద్ధం చేయడం, మీడియా ముందు కచ్చితమైన సమాచారాన్ని ఉంచడం ద్వారా విద్యార్థులలో సరైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ ఏడాది ఏబీవీపీ సభ్యత్వం 80 లక్షలకు చేరిందని వెల్లడించిన జోషి, జాతీయ విద్యా విధానం (NEP) అమలుపై నవంబర్ 21, 22 తేదీల్లో హర్యానాలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో వామపక్ష భావజాలం బలంగా ఉన్న రోజుల్లో జమ్ము నుంచి వచ్చిన సునీల్ ఉపాధ్యాయ ఎంతో కష్టపడి ఏబీవీపీకి బలమైన పునాది వేశారని, 26 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించడం తీరని లోటని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవీందర్ గుప్తా పాల్గొనగా, రోహ్‌తక్ వీసీ డాక్టర్ అమిత్ ఆర్య సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సునీల్ ఉపాధ్యాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమ్లా రోటరీ క్లబ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు.