
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించింది. హిందూ మతపరమైన ప్రదేశాల విధ్వంసం, మూక దాడులు, హత్యలను ఖండిస్తూ రాజధాని ఢాకాలోని షాబాగ్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందువులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
నవంబర్ 13న ‘హార్మోనియస్ బంగ్లాదేశ్’ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మ్యూజియం ఎదుట ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిరసనకారులు మానవహారం ఏర్పాటు చేసి, కాగడాలు చేతబట్టి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు.
హిందూ మత నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని విడుదల చేయాలని, రంగపూర్లో గణపతి చక్రవర్తి హత్యపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నారాయణగంజ్లోని లక్ష్మీ నారాయణ్ కాటన్ మిల్ ఆలయంపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసనలో బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఇబ్రహీం మియా, బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా మండలి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మహేంద్ర కుమార్ నాథ్, ప్రణవానంద మహారాజ్, బంగ్లాదేశ్ సనాతన్ పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ సుమన్ కుమార్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు సామాజిక, రాజకీయ, మత సంస్థల ప్రతినిధులు కూడా సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మతం, రాజకీయ భావజాలాలతో సంబంధం లేకుండా మూకదాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా, చట్టబద్ధమైన మార్గాల్లోనే కొనసాగించాలని సూచించారు. బంగ్లాదేశ్లో మౌలికవాదం, ఉగ్రవాద ధోరణులకు తావులేదని స్పష్టం చేశారు.
మైనారిటీల హక్కులను కాపాడటం, హిందూ దేవాలయాలకు భద్రత కల్పించడం, దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని నిరసనకారులు పేర్కొన్నారు.





