
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం దివ్య దక్షిణ యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీని మరోసారి ప్రకటించింది.
ఇప్పటికే ఓసారి యాత్ర విజయవంతమవగా.. ఇప్పుడు మరోసారి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని… పర్యాటక ప్రాంతాలను చూడొచ్చని తెలిపింది. ఈ యాత్ర ప్యాకేజీలో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌లోని ప్రముఖ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను చూసేలా ప్యాకేజీ ఉంటుందని తెలిపింది.
అక్టోబర్ 31న ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్రారంభం అవుతుందని.. ఇది 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ అని తెలిపింది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ , తెనాలి, ఒంగోలు, నెల్లూరు , గూడూర్, రేణిగుంటలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.





