News

ఖలిస్థానీ ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఉక్కుపాదం

345views

భారత్‌-కెనడా మధ్య దౌత్య విబేధాలకు దారి తీసిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు-గ్యాంగ్‌స్టర్ల పై తనిఖీల్లో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. పంజాబ్‌, హరియాణా, దిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో 50 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి.

భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలు-గ్యాంగ్‌స్టర్ల నుంచి హవాల మార్గంలో డబ్బులు వస్తున్నాయని.. వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపీఏ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హరియాణాలో నాలుగు చోట్ల, ఉత్తరాఖండ్‌లో రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు జరుగుతున్నాయి.