
భారత అంతరిక్ష పరిశోధనల కోసం ప్రయోగించే రాకెట్లలో 95 శాతం విడిభాగాలు దేశీయంగా అభివృద్ధి చేసినవేనని ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి-సీఎస్‌ఐఆర్ 82వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలోని జాతీయ పరిశోధన సంస్థలు, డిఫెన్స్ లేబొరేటరీలు, సీఎస్‌ఐఆర్ వంటి వాటితో కలిసి వీటిని రూపొందిస్తున్నట్టు తెలిపారు.
కేవలం ఐదు శాతం విడిభాగాలను మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు వివరించారు. రాకెట్ డిజైన్, తయారీతోపాటు, వాటిలో ఉపయోగించే ముఖ్య విడిభాగాలైన ప్రాసెసర్,కంప్యూటర్ చిప్స్ వంటి వాటిని కూడా దేశీయంగా తయారు చేస్తున్నట్టు తెలిపారు.
“అంతరిక్ష పరిశోధనల కోసం అవసరమయ్యే సాంకేతికత, రాకెట్ , ఉపగ్రహాల తయారీ, స్పేస్ అప్లికేషన్స్ వంటి వాటిని దేశంలోని వివిధ జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఇస్రో రూపొందిస్తుంది. వాటితోపాటు ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్స్, డీసీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, బ్యాటరీ సిస్టమ్స్, సోలార్ సెల్స్‌ను కూడా జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఇస్రో అభివృద్ధి చేసింది ” అని సోమనాథ్ తెలిపారు.
సిఎస్‌ఐఆర్ సంస్థాపక దినోత్సవంలో భాగంగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను 12 మంది యువ శాస్త్రవేత్తలకు ప్రదానం చేశారు.





