
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 21 కి.మీ మేర శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర జరిగే పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర, నిమజ్జనాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలించే విధంగా చేశారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. వైన్స్,బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటల్స్‌లోని బార్స్‌ను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
శాలిబండ నుంచి మదీనా వరకు పోలీస్ సిబ్బందితో కలిసి కాలినడకన రూటును.. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పోలీసు ఉన్పనతాధికారులు పరిశీలించారు. చార్మినార్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఎలా ఉందో తనిఖీ చేశారు. 25 వేల 694 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 125 ప్లాటూన్స్ సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీగా ఉండనున్నారు.
శోభాయాత్ర జరిగే రూట్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్‌పార్టీ పోలీసులను మోహరించనున్నారు. చార్మినార్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, మక్కా మసీదు సహా ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 5 డ్రోన్లను ఉపయోగించనున్నారు. డ్రోన్ ద్వారా కమాండ్ కంట్రోల్సెంటర్లోని మెగా స్క్రీన్‌పై స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలిస్తారు.
అటు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం గురువారం జరగనుంది. ఇటు నెక్లెస్ రోడ్డ లో నిమజ్జనాలు కొనసాగుతోన్నాయి. నిమజ్జనాలకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి భారీగా గణనాథులు తరలిరానున్నారు.





