దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారికి గట్టి బదులిస్తామం…. చైనా, పాకిస్తాన్ లను పరోక్షంగా హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

భారత్‌పై పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాలు పాకిస్థాన్ , చైనా కు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఇది విభిన్న భారత్’ అని.. దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారికి గట్టి బదులిస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఉగాండా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి.. అక్కడి భారత కమ్యూనిటీతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ”భారత్‌కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న శక్తులను భారత్ ఇన్నాళ్లూ సహించింది. కానీ ఇకపై అలా ఉండబోదు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఇది విభిన్న భారత్. దేశ భద్రతకు ముప్పుగా మారితే.. అది ఎంతటి సవాలైనా సరే దాన్ని(పాక్, చైనాను ఉద్దేశిస్తూ) ఎదిరిస్తాం. బాధ్యులకు గట్టిగా బుద్ధిచెబుతాం” అని జైశంకర్ హెచ్చరించారు.
చైనా సరిహద్దులో భారత్ మౌలిక సదుపాయాలను పెంచుతోందని, ఇప్పుడు దేశ సైనికులు మరింత ఆయుధ సామర్థ్యంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ”ఇది విభిన్నమైన భారత్. ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. ఆ విషయాన్ని యావత్ ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు భారత విధానాలపై బయటి శక్తుల ఒత్తిడి లేదు. ఎక్కడి నుంచి చమురు కొనాలి.. ఎక్కడి నుంచి కొనొద్దు అని మనల్ని ఎవరూ బలవంతం చేయలేరు” అని జైశంకర్ వ్యాఖ్యానించారు.