News

కేరళ రైళ్లో పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టడం వెనుక ఉగ్రకుట్ర ఉందా?

70views

కేరళలోని అలప్పుళ – కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం రాత్రి ఓ దుండగుడు ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టడం వెనుక ఉగ్రకుట్ర ఉందా? టెర్రరిస్ట్‌ మాడ్యూల్స్‌ ప్రోద్బలంతోనే అనుమానితుడు ఫారూఖ్‌ సైఫీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? పోలీసులు కూడా ఉగ్రవాద కోణాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

ఏం జరిగింది ?
ఆదివారం రాత్రి 9.30 సమయంలో అలప్పుళ – కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోళికోడ్‌ నగరాన్ని దాటి కోరపుళ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన వెంట బాటిళ్లలో తెచ్చుకున్న పెట్రోల్‌ను తోటి ప్రయాణికుడిపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. చూస్తుండగానే ఆ మంటలు ఇతరులకు అంటుకున్నాయి. దీంతో భయపడి చిన్నారితోపాటు ఓ మహిళ, ఓ యువకుడు కదులుతున్న రైల్లోంచి దూకేశారు. ఆ ముగ్గురూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈలోగా.. అప్రమత్తమైన ప్రయాణికులు కకావికలమై.. ఎమర్జెన్సీ చైన్‌ను లాగి, రైలును నిలిపివేశారు. రైలు ఆగగానే దుండగుడు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఎవరా దుండగుడు?
సంఘటనాస్థలికి సమీపంలో పోలీసులు నిందితుడిదిగా అనుమానిస్తున్న ఓ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో పెట్రోల్‌ సీసా , సిమ్‌కార్డులు లేని రెండు మొబైల్‌ఫోన్లు, హిందీ, ఇంగ్లిష్‌లో ఉన్న పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడి పేరు ఫారూఖ్‌ సైఫీ అని, అతడి స్వస్థలం నోయిడా అని గుర్తించారు. ఫారూఖ్‌ ప్రస్తుతం కోళికోడ్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా, కార్పేంటర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్న ఆనవాళ్లను బట్టి.. అతడి ఊహాచిత్రాన్ని రూపొందించి, మీడియాకు విడుదల చేశారు.

ఉగ్ర కుట్రపై ఆధారాలు..?

నిందితుడు ఫారూఖ్‌ అలప్పుళ-కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు జనరల్‌ బోగీలో ప్రయాణించాడు. ఘటన జరిగింది డీ1 ఎగ్జిక్యూటివ్‌ బోగీ. ఈ బోగీలో ప్రయాణికుల పేర్లను ముందే గుర్తించిన ఫారూఖ్‌.. పక్కా వ్యూహంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేసింది. సిట్‌ అధికారిగా మళప్పురం క్రైమ్‌బ్రాంచ ఎస్పీ పి.విక్రమన్‌ను నియమించింది. ఈ బృందంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ATS) డీఎస్పీ బైజోపాలోస్‌ కూడా ఉన్నారు. దీన్ని బట్టి.. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఉగ్ర కుట్రను గుర్తించారని, అందుకే ఏటీఎస్‌ అధికారిని కూడా రంగంలోకి దింపారని స్పష్టమవుతోంది. 1997లో కూడా కేరళలోని త్రిషూర్‌లో రైలులో బాంబు పేలుడు ఘటన జరిగింది.

దేశంలోని పలుప్రాంతాల్లోనూ రైళ్లలో బాంబు దాడి ఘటనలు నమోదయ్యాయి. రైలులో మంటలు రేగితే.. దాని వేగానికి గాలి తోడవ్వడంతో వేగంగా ఇతర బోగీలకు వ్యాప్తిచెందుతాయని.. అందుకే ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు ఒడిగడతారని పోలీసులు చెబుతున్నారు. ఫారూఖ్‌ కూడా ఎగ్జిక్యూటివ్‌ బోగీలోకి చొరబడగానే.. మారుమాట్లాడకుండా.. అక్కడ ఉన్నవారిపై పెట్రోల్‌ చల్లి, నిప్పంటించడం కూడా ‘లోన్ వోల్ఫ్‌ టెర్రర్‌ అటాక్‌ లాంటిదేనని వివరిస్తున్నారు. పైగా.. నిందితుడు రైలు ఆగగానే దిగి మెయినరోడ్‌ వైపు వెళ్లాడని, అప్పటికే అక్కడ వేచి ఉన్న ఓ వ్యక్తి బైకు ఎక్కి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

కన్నూరులో ఉగ్ర మూలాలు..!

కేరళలోని కన్నూరులో పలు సందర్భాల్లో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఘటన జరిగింది కూడా అలప్పుళ-కన్నూరు ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కావడంతో సిట్‌ ఉగ్రకోణంపై దృష్టిసారించింది. 1998లో కోళికోడ్‌లో తమిళనాడు బస్సు దహనం కేసులో నిందితుల మూలాలు కన్నూర్‌లోనే బయటపడ్డాయి. ఆ తర్వాత కన్నూర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి, ఇక్కడ తలదాచుకుంటూ ఉగ్రవాద కుట్రలు పన్నిన తోడల్లుళ్లు అబ్దుల్‌ సత్తార్‌, అబ్దుల్‌ జబ్బార్‌, టి.నసీర్‌ దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రపన్నారు.

అబ్దుల్‌ సత్తార్‌, జబ్బార్‌ను కర్ణాటక పోలీసులు 2009లో బెంగళూరు పేలుళ్ల కేసులో అరెస్టు చేయగా.. బంగ్లాదేశలో తలదాచుకున్న నసీర్‌ను చిట్టాగాంగ్‌లోని ఓ దర్గా వద్ద ఇంటర్‌పోల్‌ సాయంతో అరెస్టు చేశారు. వీరిలో సత్తార్‌కు.. ఇండియన ముజాహిదీన(ఐఎం) మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్‌… ప్రస్తుతం పాకిస్థానలో ఉన్నాడు.అతనితో తో సంబంధాలున్నట్లు కర్ణాటక పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. 2007-10 మధ్యకాలంలో కన్నూరులోని కొబ్బరి చెట్లపైన ఉగ్రమూకలు దాచిన ఏకే-47 తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న అలప్పుళ-కన్నూరు రైలు ఘటనలోనూ కన్నూరు మాడ్యుల్‌ ఉగ్రవాదుల హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.