ArticlesNews

మళ్లీ తెరపైకి వచ్చిన అరుణాచల్ వివాదం.. ఎందుకీ గొడవ?

106views

సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. దీనిపై భారత్ స్పందిస్తూ పెట్టుడు పేర్లను తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో పూర్తిగా భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనిదని స్పష్టం చేసింది. అయితే చైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటం ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కూడా కాదు. అసలు ఈ వివాదానికి మూలం ఏమిటంటే…

అరుణాచల్ ప్రదేశ్ భారత దేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఈ రాష్ట్రం భూటాన్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. మన దేశ రక్షణ, భద్రత విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. బ్రిటిష్ అధికారులు నియంతృత్వంతో గీసిన రేఖతోపాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. అయితే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తుంగలో తొక్కింది. అసమానతలతో కూడిన ఒప్పందాలను తమపై రుద్దారని ఆరోపిస్తూ, భారత దేశంతో అన్ని సరిహద్దులను మళ్లీ చర్చించి, నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది. ఈస్టర్న్ సెక్టర్‌లో మెక్‌మెహన్ రేఖను 1914లో బ్రిటిష్ ఇండియా-టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. చైనా, టిబెట్, గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం జరిగింది.

చిచ్చు రేపినది చైనాయే
అధికారికంగా గీయని ఈ సరిహద్దును చైనా వివాదాస్పదం చేసింది. చైనా 1949-50లో టిబెట్‌పై దాడి చేసింది. సిమ్లా ఒప్పందంపై టిబెట్ ప్రభుత్వం సంతకం చేసిందని, అప్పటికి టిబెట్ సార్వభౌమాధికారంగల దేశం కాదని చైనా వాదించింది. తవంగ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగమని చైనా గట్టిగా వాదించింది. 1962లో భారత్‌పై చైనా యుద్ధం చేసింది. హిమాలయాలకు పశ్చిమ దిశలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. 90 వేల చదరపు కిలోమీటర్లు తనదేనని వాదించింది. అంటే దాదాపు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతా తనదేనని వాదించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దేశంలో అంతర్భాగంగా చూపించే మ్యాపులను తయారు చేసింది. ఈ రాష్ట్రాన్ని జంగ్నన్ రాష్ట్రం అని పేర్కొంది.

ప్రాంతాల పేర్ల మార్పు

అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను గతంలో కూడా చైనా మార్చింది. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు 2017, 2021 సంవత్సరాల్లో ప్రయత్నించింది. అప్పుడు కూడా మన దేశం ఈ దుశ్చర్యలను ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత దేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పెట్టుడు పేర్లను పెట్టినంత మాత్రానికి వాస్తవాలు మారిపోయే ప్రసక్తే లేదని గట్టిగా వక్కాణించింది.

తరచూ ఘర్షణలు

చైనా, భారత్ సైన్యాల మధ్య తీవ్రమైన ఘర్షణ 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. 2020లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా సైన్యం నలుగురిని కోల్పోయినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. కానీ 40 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. 2022 డిసెంబరులో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్, యాంగ్‌ట్సే వద్ద ఇరు దేశాల సైన్యాలు తలపడ్డాయి.

మూడు సెక్టర్లు

భారత్-చైనా మధ్య సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టర్ అంటారు. లడఖ్‌ వద్ద ఉన్న సరిహద్దును వెస్టర్న్ సెక్టర్ అంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దును మిడిల్ సెక్టర్ అంటారు. అయితే ఎల్ఏసీ కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమేనని చైనా వాదిస్తోంది. ఈ సరిహద్దులను సక్రమంగా నిర్వచించకపోవడం వల్లే ఇరు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.

అమెరికా స్పందన

అరుణాచల్ ప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగమని చెప్తూ ఇద్దరు అమెరికన్ సెనేటర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో సెనేట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటాన్ని ఖండించారు. డెమొక్రాట్ జెఫ్ మెర్క్‌లీ (ఓరెగాన్), రిపబ్లికన్ బిల్ హాగెర్టీ (టెన్నెసీ) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.