
ఇటీవలి కాలంలో అతి తక్కువ వయసువారు కూడా గుండె పోటు వల్ల మరణిస్తుండటంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమోనని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పందించారు.
ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, చాలా మంది యువ కళాకారులు, క్రీడాకారులు, స్పోర్ట్స్‌పర్సన్స్ ఆడుతూ, పాడుతూ ఉన్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను మనం చూశామని చెప్పారు. కోవిడ్, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమో పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని చెప్పారు. దీని కోసం ఓ పరిశోధనను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు రెండు లేదా మూడు నెలల్లో రావచ్చునని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి నాలుగో ప్రభంజనం వచ్చే అవకాశాల గురించి మాండవీయ మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గతంలో ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్ బీఎఫ్.7 వచ్చిందని, ఇప్పుడు ఎక్స్‌బీబీ1.16 సబ్ వేరియంట్ వచ్చిందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని చెప్పారు. సబ్ వేరియంట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమాదం కలిగించే అవకాశం ఉండదనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుభవాలను బట్టి తెలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం కనిపిస్తున్న అన్ని వేరియంట్లపైనా మన వ్యాక్సిన్లు పని చేస్తున్నాయని చెప్పారు.