
కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో హోలీ పండుగ నాడు మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకిడి పంబ సినిమా చూసినట్టు ఉంటుంది. విచిత్రమైన ఆచారంతో అక్కడివారు హోలీ పండుగ నాడు సందడి చేస్తారు. రెండు రోజులపాటు సాగే ఈ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక ప్రత్యేకత ఏమిటంటే… కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు బోర్డర్లో ఉండే సంతేకుడ్లురు గ్రామంలో హోలీ పండుగ రోజున వింత ఆచారం కొనసాగుతుంది. పండుగ రోజున పురుషులంతా ఆడవాళ్ళ వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చెయ్యటం వల్ల అంతా మంచి జరుగుతుందని వారు విశేషంగా నమ్ముతున్నారు.
స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని అచ్చం అమ్మాయిల మాదిరిగా రెడీ అవుతారు. ఈ ఆచారం ఎంతోకాలంగా తరతరాల నుండి కొనసాగుతుందని, ఇలా చేయడం వల్ల గ్రామస్తులు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని స్థానికులు చెబుతున్నారు. అయితే గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి, గ్రామంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి పురుషులు ఆడవాళ్ళ వేషధారణ వేసి పూజలు చేయడం ఆనవాయితీ అని వారు చెబుతున్నారు.
ఇక ఇక్కడ వారి ఈ విచిత్ర సాంప్రదాయాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారని తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల వేషధారణలో దేవుడిని పూజిస్తారని చెబుతున్నారు. ఇది ఇక్కడి వారి తరతరాల సాంప్రదాయం అని అంటున్నారు. ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. అత్యంత ఘనంగా మగవాళ్ళు అందరూ మగువలుగా మారి జరుపుకునే ఈ పండుగ ఆ గ్రామంలోని హోలీ స్పెషల్.





