
భారతీయ సంస్కృతి, సాంప్రదాయ విలువలు, జాతీయ చైతన్యాన్ని యువతలో పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక కేసరితో సంబంధం ఉన్న మహాత్మా కాలేజ్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో ‘మాతంగి మల్టీమీడియా రికార్డింగ్ స్టూడియో’ను కోజికోడ్ లో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జర్నలిజాన్ని సామాజిక, సాంస్కృతిక భాగస్వామ్యంతో అనుసంధానించాలనే లక్ష్యంతో సంఘ్ కార్యకర్తలు కేసరిని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ వారపత్రిక కేవలం వార్తలు, ప్రచురణలకే పరిమితం కాకుండా భారతీయ సాంస్కృతిక వారసత్వం, జాతీయ గర్వం, సంప్రదాయ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని కొనియాడారు.
భారతీయ తాత్విక సంప్రదాయాల పరిచయంలో కీలక పాత్ర
ఆర్ఎస్ఎస్ సీనియర్ మేధావి పి. పరమేశ్వరన్ సేవలను ఈ సందర్భంగా మోహన్‌లాల్ గుర్తుచేసుకున్నారు. తరతరాల మలయాళీ ప్రజలకు భారతదేశ తాత్విక సంప్రదాయాలను పరిచయం చేయడంలో కేసరి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
సైనికుల జీవితాలు.. దేశభక్తి స్ఫూర్తి
సాయుధ దళాల నేపథ్యంలో తాను నటించిన సినిమాల గురించి కూడా మోహన్‌లాల్ ప్రస్తావించారు. చిత్రీకరణ కోసం సైనిక స్థావరాలు, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలను సందర్శించినప్పుడు సైనికులు ఎదుర్కొనే సవాళ్లు, వారి బాధ్యతలను దగ్గరగా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు.
‘ఆపరేషన్ గంగా’లో జాతీయ ఐక్యత సందేశం
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ చేపట్టిన తరలింపు కార్యక్రమం ఆధారంగా రూపొందుతున్న తన రాబోయే చిత్రం ఆపరేషన్ గంగా గురించి కూడా మోహన్‌లాల్ వివరించారు.
అంతర్జాతీయ సంక్షోభ సమయంలో భారతదేశం స్పందించిన తీరు, జాతీయ ఐక్యత, దేశ పౌరుల పట్ల బాధ్యత వంటి అంశాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని తెలిపారు.





