
చైనాతో యుద్ధం అన్న అంశంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. చైనాది పెద్ద ఎకానమీ అని, మనది చిన్న ఎకానమీ అని.. పెద్ద ఎకానమీతో వెళ్లి యుద్ధం చేయాలా? అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సైన్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇలా ఓటమిని ఒప్పుకొంటున్న రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. మోదీ సర్కారు చైనా ముందు తల వంచినట్లుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. జైశంకర్ ఇటీవల ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘వాళ్లది(చైనా) పెద్ద ఎకానమీ. ఓ చిన్న ఎకానమీగా.. నేను వెళ్లి పెద్ద ఎకానమీతో యుద్ధం చేయాలా? ప్రతిదానికీ స్పందించామా? లేదా? అన్నది కాదు.. తెలివిగా ఆలోచించామా? లేదా? అన్నదే ముఖ్యం’’ అని అన్నారు. సరిహద్దులకు భారీ సంఖ్యలో బలగాలను తరలించరాదని భారత్-చైనా మధ్య ఒప్పందం ఉందన్నారు. ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాలా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ సైనికాధికారులు మండిపడుతున్నారు. ‘‘యుద్ధం కోరుకునేది భారత్ కాదు.. చైనా యే అన్న విషయాన్ని జైశంకర్ తెలుసుకోవాలి’’ అని విశ్రాంత మేజర్ జనరల్ షయిల్ ఝా ట్వీట్ చేశారు.