News

అయ్యప్ప భక్తుల కోసం తెలుగు సహా 6 భాషల్లో ‘శరణ్’ డిజిటల్ సేవలు ప్రారంభం

2views

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ‘శరణ్’ (SABARIMALA ASSISTANCE & ROUTE ADVISORY NETWORK) పేరుతో ప్రత్యేక డిజిటల్ వేదికను ప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు భక్తులకు కూడా వారి సొంత భాషలో సమాచారం అందుబాటులో ఉండటం విశేషం.

ఈ డిజిటల్ వేదికను రాష్ట్ర మంత్రి కె.ఎం. షాజీ ప్రారంభించారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్లం.. ఇలా మొత్తం ఆరు భాషల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చే భక్తులు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ వేదిక ఉపయోగపడనుంది.

ఒకే వేదికపై సమస్త సమాచారం!

శబరిమల యాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఒకే చోట అందించేలా ‘శరణ్’ డిజిటల్ వేదికను రూపొందించారు. ఇందులో భక్తులకు అవసరమైన పలు వివరాలు అందుబాటులో ఉంటాయి.
– శబరిమలకు వెళ్లే ప్రయాణ మార్గాల వివరాలు.
– మార్గమధ్యంలో విశ్రాంతి కేంద్రాల సమాచారం.
– అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రుల వివరాలు.
– బస్సులు, ఇతర రవాణా సదుపాయాల సమాచారం.
– స్థానిక ప్రకటనలు, భక్తులకు అవసరమైన తాజా సమాచారం.

యాప్ డౌన్‌లోడ్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు!
ఈ డిజిటల్ సేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. నేరుగా మొబైల్ బ్రౌజర్‌లోనే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ డిజిటల్ వేదికను మొబైల్ ఫోన్ హోమ్ స్క్రీన్‌కు కూడా జోడించుకునే సదుపాయం కల్పించారు.

దీంతో శబరిమల యాత్రకు వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవడం, వైద్య సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాల వివరాలు తెలుసుకోవడం మరింత సులభం కానుంది.