
ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతిచెందిన అమానుష ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు రావడంతో పరిస్థితిని గ్రహించిన హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు తన తండ్రి పనిచేసే వద్దకు వెళ్లగా.. అక్కడ వీధి కుక్కలు దారుణంగా బాలుడిపై దాడి చేశాయి. దీంతో ఆ బాలుడు మరణించాడు. ఈ దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడం.. అవి సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు రావడంతో అందరూ చలించిపోయారు. దీనిపై ప్రస్తుతం హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది… ఇది అమానుష ఘటన అని వ్యాఖ్యానించింది. కుక్కల దాడిలో పసివాడు మృతిచెందడం అత్యంత బాధాకరమని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, మీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడంటూ హైకోర్టు మండిపడింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి16కి వాయిదా వేసింది.
నగరంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీధి కుక్కలు దాడులు పెరిగిపోతుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. బాలుడు ప్రదీప్ మృతికి నష్ట పరిహారం చెల్లించడాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి16కి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..?
నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అంబర్ పేట చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు.
ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా.. మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్.. ఆ తర్వాత తన అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కాలయముల్లా ఆ వీధి కుక్కలు మాత్రం బాలుడిపైకి వస్తూనే ఉన్నాయి. బాలుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా ఆ పసివాడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మూడు కుక్కలు బాలుడిని ఈడ్చుకెళ్తూ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాలుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.





