News

ఘనంగా శివపార్వతుల కొండచుట్టు వేడుక

217views

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బుధవారం శివపార్వతుల కొండచుట్టు వేడుకగా జరిగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలకు, మునులకు ఆదిదంపతులు వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరుడు,జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి చప్పరాలపై గిరిప్రదక్షిణకు తీసుకెళ్లారు.భేరివారి మండపం వద్ద భేరి కులస్థులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం జయరామారావు వీధి, ఎన్టీఆర్‌ నగర్‌, తెలుగుగంగ, కైలాసగిరి, రాజీవ్‌నగర్‌కాలనీల మీదుగా గిరిప్రదక్షిణ సాగింది. రామాపురం రిజర్వాయరు సమీపంలో ఉన్న అంజూరు మండపం వద్ద స్వామి అమ్మవార్లను విశ్రాంతి కోసం కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. అంజూరు మండపం నుంచి వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమ సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు భక్తిపూర్వకంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రాత్రి ముక్కంటి ఆలయానికి తీసుకువచ్చారు.కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడు అశ్వవాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహవాహనంపై అధిష్టించి పురవిహారం చేశారు.