News

ట్రిపుల్‌ తలాక్‌ ఎందుకు నేరమవుతుంది.. కేరళ సీఎం పినరయి సంచలన వ్యాఖ్యలు!

121views

ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం చేసిన చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు అనేవి అన్ని మతాల్లోనూ ఉంటాయని, అలాంటప్పుడు కేవలం ముస్లింలలో ట్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని ఆయన వింత ప్రశ్నలు వేశారు. కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేదిలేదని అన్నారు.

కాసరగాడ్ జిల్లాలో సీపీఎం నిర్వహించిన కార్యక్రమంలో పినరయి విజయన్ ప్రసంగిస్తూ.. శిక్ష అనేది మతం ప్రాతిపదికగా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండకూడదని అన్నారు. ఇతర మతాల్లో విడాకుల కేసును సివిల్ కేసుగా చూస్తున్నప్పుడు, ఇస్లాంలోని ట్రిపుల్ తలాక్ అనేది క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ కేసుగా పరిగణిస్తూ, నేరంగా చూస్తున్నారని, ఇతర మతాల్లో మాత్రం ఇవి సివిల్ కేసులని అన్నారు. ఒక మతం అనుసరిస్తే ఒక చట్టం, మరో మతం వారికి మరో చట్టం ఉండవచ్చా అని నిలదీశారు.

సీఏఏ‌ను కేరళలో అమలు చేయం..
సిటిజన్‌షిప్ అమెండమెంట్ యాక్ట్ (CAA)ను కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని పినరయి విజయన్ స్పష్టం చేశారు. ”మనమంతా భారతదేశ పౌరులం. ఫలనా మతంలో పుట్టినందుకే పౌరసత్వం వస్తుందని ఎలా చెప్పగలం? పౌరసత్వానికి మతం ప్రాతిపదిక ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా సిటిజెన్‌షిప్ ఇచ్చేందుకు మతాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందన్నారు. రాష్ట్రంలో సీఏఏను అమలు చేసేది లేదని, గతంలో కూడా ఈ విషయం చెప్పానని అన్నారు.

సీఎం అవగాహన పెంచుకుని మాట్లాడాలి…
ట్రిపుల్ తలాక్‌పై పినరయి విజయన్ వ్యాఖ్యలను బీజేపీ ప్రతినిధి టామ్ వడక్కన్ ఖండించారు. ట్రిపుల్ తలాక్‌కు, కోర్టులో విడాకులకు జరిగే సాధారణ సివిల్ ప్రొసీజర్‌కు ఉన్న తేడాను ముందుగా సీఎం తెలుసుకోవాలని చురకలంటించారు. రెండింటికీ పోలికే లేదని చెప్పారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపంచారు.

కేరళలో భిన్న పరిస్థితులు..
కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పటి నుంచి విభిన్న సంస్కృతులు, ఆచారాలు కొనసాగుతున్నాయి. ఇవి దేశ సమగ్రతను దెబ్బతీసేలా తయారయ్యాయి. దేశం మొత్తం ఒక చట్టం ఉంటే.. కేరళలో మాత్రం ప్రత్యేక చట్టం ఉందంటూ.. అక్కడి నాయకుల తీరు విచిత్రంగా ఉంటోంది. ఎలాంటి చట్టబద్దత లేకుండా.. కేవలం తలాక్‌ అనే పదం చెప్పగానే విడిపోవడం అనే ప్రక్రియను ముస్లిం మహిళలే వద్దని గతంలోనే చెప్పారు. దీని వల్ల తమ పిల్లల భవిష్యత్తు, కుటుంబ వ్యవస్థ పక్కదారి పడుతోందని వారు వాపోయారు. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తలాక్‌ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముస్లిం మహిళలు, మన భారతదేశ ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ను దేశంలో రద్దు చేశారు. ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతు తెలియజేయడంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మండిపడుతున్నారు. కేవలం అధికారం, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని వాపోతున్నారు.