News

శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థం ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

201views

శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థం ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వంశ ధార తీరంలో చక్రతీర్థ స్నానం నిర్వహించారు. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. శ్రీముఖలింగం లోని స్వామి దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులుదీరారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ నందివాహ నంపై ఆశీనులను చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో బి.శాంతి ఆధ్వర్యంలో గ్రామోత్సవం ప్రారంభించారు. సుమారు రెండు కిలోమీటర్లు ఊరేగింపుగా మిరియాపల్లి రేవుకు తీసుకెళ్లారు. ఆనవాయితీ ప్రకారం లుకలాపు వంశీయులు అర్చకులతో కలిసి స్వామికి పూజలు చేశారు. మధ్యాహ్నం 2.30గంటలకు వంశధార నదిలో ఉత్సవ మూర్తులకు చక్రతీర్థ స్నానాలు చేయించారు. ఈ సమయంలో లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం పులకించింది. శివనామస్మరణ మార్మోగింది. మధ్యాహ్నం 3.30గంటలకు చక్రతీర్థ స్నానం అనంతరం ఉత్సవమూర్తులను మళ్లీ నంది వాహ నంపై ఆశీనులను చేసి.. శ్రీముఖలింగం గర్భగుడికి తిరుగు పయనమయ్యారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వంశధార తీరంలో తోపులాట చోటుచేసుకుంది. నదిలో నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో అవస్థలు పడ్డారు.