ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు చల్లని కబురు వినిపించారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ బస్సులను ఎప్పటి నుంచి నడిపించాలనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నారు.
`గ్రీన్ సప్తగిరి` పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపించనున్నారు. మలి విడతలో తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని రోడ్డెక్కించడానికి సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి. వేసవి సెలవుల నాటికల్లా ఆయా బస్సులను ప్రయాణికులకు తమ సేవలను అందించడానికి సిద్దం కానున్నాయి. ఇవి జీరో ఎమిషన్ బస్సులు. డీజిల్ కు బదులుగా విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడవనున్నాయి.