
శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశాడు.ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ మయూర వాహనంపై ముందుకుసాగారు.ముందు మూషికవాహనంపై వినాయకస్వా మి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది. అంతకు మునుపు చతుర్మాడ వీధుల్లో గంట మోగిస్తూ మంత్ర జలాలతో శుద్ధి చేశారు. రావణ,మయూర వాహనాలపై పురవిహారంచేస్తున్న పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు.కోలాట కళాకారుల నృ త్యాలు, భక్తులు తన్మయత్వంతో చేసిన శంఖానాదం, శివనామస్మరణలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు బంగారు హంస వాహనంపైన, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు యాళి వాహనంపైన పురవీధుల్లో ఊరేగారు. ఉభయదారులుగా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన చిట్టాప్రగడ సీతారామాంజనేయులు కుటుంబసభ్యులు వ్యవహరించారు. ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి,ఆలయ చైర్మన్ అం జూరు శ్రీనివాసులు,ఈవో సాగర్‌బాబు, పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తరపున నేడు పట్టువస్త్రాలు సమర్పణ
శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఉదయం 8గంటలకు మణికంఠేశ్వరస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి సమర్పించనున్నట్లు తెలిపారు.





