
సిలికాన్ వ్యాలీగా పేరు గడించిన బెంగళూరు నగరంలో ఓటు వేసేందుకు ఇకపై పెద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేకుండా బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. సినిమా, రైల్వే, మెట్రో, బస్ టికెట్‌లను ముందుగానే బుక్ చేసుకునే తరహాలోనే తాము ఓటు వేయదలచుకున్న సమయాన్ని కూడా ఓటర్లు యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. బెంగళూరులో ఓటింగ్ శాతాన్ని కనీసం అదనంగా మరో 10 శాతం పెంచేందుకు ఈ యాప్ బాగా దోహదపడుతుందని బీబీఎంపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తిని చూపని యువతను దృష్టిలో ఉంచుకునే ఈ యాప్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ యాప్‌ను వినియోగించాలన్న ప్రతిపాదన ఉందని, ఎన్నికల సంఘం అధికారులతో చర్చిస్తున్నామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ మీడియాకు తెలిపారు. రాజధాని బెంగళూరులో ఓటింగ్ శాతం గరిష్టంగా 55గా ఉందని దీన్ని కనీసం 65 నుంచి 70 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతోనే ఈ యాప్‌ను రూపొందించామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. కాగా పింక్ పోలింగ్ బూత్‌ల తరహాలోనే సౌరశక్తితో పనిచేసే గ్రీన్ పోలింగ్ బూత్‌ల పరికల్పనను కూడా బీబీఎంపీ అధికారులు పరిశీలిస్తున్నారు.





