News

విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం!

366views

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాలయం నుంచే కొనసాగించింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన లావాదేవీలన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశాలకు హైదరాబాద్‌ నుంచే అధికారులు విజయవాడకు వస్తున్నారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కష్టసాధ్యమవుతుందని.. రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో విశాఖలో ఆర్‌బీఐ బృందం ఇటీవల పర్యటించింది. జిల్లా అధికారులతో చర్చించి పలు భవనాలను పరిశీలించింది. 500 మంది ఉద్యోగులతో ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.

నిర్మాణం పూర్తయిన భవనం వైపే మొగ్గు..
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం అవసరమని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బృందం జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జునతో సంప్రదింపులు జరిపింది. 500 మంది ఉద్యోగులతో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వానికి ఇప్పటికే వివరించినట్టు ఆర్‌బీఐ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో మధురవాడ, రుషికొండ, ఆరిలోవ, కొమ్మాది, భీమిలి, హనుమంతువాక, కైలాసగిరి, సాగర్‌నగర్‌ పరిధిలోని పలు భవనాల్ని పరిశీలించారు. కార్యాలయ నిర్మాణానికి ఏపీఐఐసీకి చెందిన స్థలం సిద్ధంగా ఉందని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. అయితే వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి నిర్మాణం పూర్తయిన భవనమైతే అనుకూలంగా ఉంటుందని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. దీంతో భవనాల పరిశీలనలో కొందరు ఉద్యోగులు నిమగ్నమైనట్లు కలెక్టరేట్‌ వర్గాలు వెల్లడించాయి. తాము అనుకున్న విధంగా భవనం లభిస్తే నెల వ్యవధిలోపే కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆర్‌బీఐ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.