
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సమాచారాన్ని ముంబయి పోలీసులకు ఎన్ఐఏ తెలియజేయడంతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మెయిల్ వెనుక నిజానిజాలు నిర్దారించేందుకు ముంబై పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ సంయుక్త దర్యాప్తు చేపట్టింది. గత నెలలోనూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ పాఠశాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
2022లోనూ ఇలాగే..
అక్టోబర్ 2022లో ఇదే తరహాలో ముంబై నగరంలో పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు పోలీసులకు బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. సిటీలోని ఇన్ఫినిటీ మాల్ అంథేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్టులో ఈ బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. ఈ క్రమంలోనే 2022 ఆగస్టులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడైన సలీమ్ ఖురేషి అలియాస్ సలీమ్ ఫ్రూట్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా షీకీల్ సన్నిహితుడిగా కూడా ఖురేషికి పేరుంది. షకీల్ పేరుతో ఆస్తుల తగాదాల పరిష్కారంతో భారీగా సొమ్ములు వసూలు చేసేవాడని, వాటిని డీ కంపెనీ తరఫున ఉగ్రకార్యకలాపాల నిధుల కోసం ఈ చర్యలకు పాల్పడేవాడని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.





