
భక్తులకు ఇబ్బందులు లేకుండా రథసప్తమి ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. ప్రశాంతంగా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28న రథసప్తమిని పురస్కరించుకుని.. 80 అడుగుల రోడ్డులో వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఎస్పీ రాధికతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అరసవల్లిలోని ఆదిత్యుడి ఆలయంలో ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ‘ఆర్‌అండ్‌బీ అధికారులు, పోలీసులు కలిసి పార్కింగ్, బారికేడ్లు ఏర్పాటు చేయాలి. స్థానిక 80 అడుగుల రోడ్డులో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలి. బయట నుంచి వాహనాలను ఆలయ ఆవరణ వద్దకు అనుమతించరాదు. 4 లేదా 5 ప్రొటోకాల్ వాహనాలను సన్‌రైజ్ హోటల్ వద్ద ఉంచి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలి. వీఐపీ దర్శనాల పేరిట సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆలయం లోపల పోలీసులు, దేవదాయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలి. ఆలయ పరిసరాల్లో ఎక్కడా చెత్త ఉండరాదు. మునిసిపల్ సిబ్బంది, గ్రామీణ నీటిసరఫరా శాఖ సమన్వయంతో భక్తులకు తాగునీరు అందజేయాలి. కేశఖండనశాల వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండాలి. పుష్కరిణి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి. గత ఏడాది పబ్లిక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేయలేదు. ఈ సారి సరైన పాయింట్లలో ఏర్పాటు చేసి భక్తులకు మార్గనిర్దేశం చేయాలి. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక రవాణా, దర్శన ఏర్పాట్లు చేయాలి. సీసీ కెమెరాల నిఘా ఉండాలి. కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ, దేవదాయ శాఖకు చెందిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి’ అని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎంవి.సురేష్‌బాబు, ఆర్డీవో బి.శాంతి, డీఎస్పీ మహేంద్ర మాతే, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు, కమిషనర్ ట్రాఫిక్ జీవీ ప్రసాదరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.అనూరాధ, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు, అగ్నిమాపక అధికారి వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ పాల్గొన్నారు





