పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు పొందండి అంటున్న సిక్కిం సీఎం.. ఈ భారీ ఆఫర్ వెనుక అసలు కారణం ఇదే?

భారత దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లకు పైగా చేరిపోయింది. రానున్న రోజుల్లో చైనాను కూడా దాటిపోయి నంబర్ 1గా అవతరించనుంది. ఈక్రమంలో మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పిల్లలను కంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తారంట. సంవత్సరంపాటు ప్రసూతీ సెలవులు, తండ్రికి కూడా 30 రోజులపాటు సెలవులు ఇచ్చేస్తారంట. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లలు పుడితే వారి జీతాలు కూడా పెంచుతారంట. ఇద్దరు పిల్లలకు ఒక ఇంక్రిమెంట్, ముగ్గురు పిల్లలకు డబుల్ ఇంక్రిమెంట్ ఇచ్చేస్తారంట. ఈ ప్రకటన చేసింది స్వయాన సిక్కిం ముఖ్యమంత్రి కావడం గమనార్హం. అసలు ఆయన ఏమన్నారంటే?
మాఘే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం సిక్కింలోని జోరెథాంగ్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిక్కిం సంతానోత్పత్తి రేటు ఇటీవలి భారీగా తగ్గిందన్నారు. అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేసిందని, సిక్కిం జాతి జనాభా క్షీణించిందన్నారు. గత ప్రభుత్వాలు ఒకే బిడ్డ నినాదంతో ముందుకెళ్లాయని.. తద్వారా ఇప్పుడు రాష్ట్ర జనాభా ఏడు లక్షలుగా ఉందని, గత ప్రభుత్వాల నిర్ణయాల ఫలితమే నేడు రాష్ట్ర జనాభా క్షీణించిందని సీఎం తమాంగ్ అన్నారు. రాష్ట్ర జనాభాను పెంచే ఆవశ్యకత ఉందని, ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రయత్నించాలని సూచించారు. సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేస్తూ పిల్లల్ని కనే ఉద్యోగులకు సీఎం ప్రోత్సాహాకాలు ప్రకటించారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని తెలిపారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇక్రిమెంట్ తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతిస్తామని చెప్పారు. ఒక బిడ్డ మాత్రమే ఉన్న మహిళకు ఈ ఆర్థిక ప్రయోజనం అందుబాటులోకి రాదని తమంగ్ స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ఇప్పటికే స్త్రీలకు 365 రోజుల ప్రసూతి సెలవులను అందజేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. తండ్రి అయిన పురుషులకు కూడా పితృత్వ సెలవులు 30 రోజులు ఇస్తామన్నారు. ఎక్కువమంది పిల్లలను కనేందుకు సామాన్య ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు సీఎం తమాంగ్. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ శాఖలు వెల్లడిస్తాయని తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్ తెలిపారు. ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. మహిళలు కృత్రిమంగా గర్భం దాల్చేలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిక్కింలోని ఆస్పత్రుల్లో ఐవిఎఫ్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించిందని సీఎం తెలిపారు.





