
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ పథకం కింద 12 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందజేశారు. 13వ విడత నిధులను త్వరలో విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద భూమి ఉన్న రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తం పంట పెట్టుబడిగా చెల్లిస్తుంది.
రైతుల భూమి, లబ్ధిదారుల రికార్డులను సెంట్రల్ డేటాబేస్‌లలో అప్‌డేట్ చేయని కారణంగానే చాలా మంది రైతులకు పీఎం కిసాన్ నగదు అందలేదు. పారదర్శకత కోసం, మోసాలను తగ్గించడం కోసం కేంద్రం ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. దీంతో ఈ ఫిబ్రవరిలో తదుపరి విడత నిధుల విడుదలకు ముందు సెంట్రల్ డేటాబేస్‌లో రైతుల రికార్డులను అప్‌డేట్ చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.





