ఏటా సంక్రాంతి సందర్బంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట విషాదం నింపింది. ఈ ఏడాది వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్.. జల్లికట్టులో భాగంగా ఎద్దుతో తలపడ్డాడు. ఎద్దు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్ రాజ్‌కు స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని రాజాజీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
మరో ఘటనలో.. జల్లికట్టు చూస్తున్న ఎం.అరవింద్ అనే వ్యక్తిని ఎద్దు దూసుకొచ్చి ఢీకొట్టింది. తిరుచిరాపల్లి జిల్లాలోని సూరియూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టులో 75 మంది గాయపడ్డారు. జల్లికట్టు వీక్షిస్తున్న వారి పైకి ఎద్దులు అకస్మాత్తుగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన జల్లికట్టులో 34 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దూకింది. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. శికారిపురలో జల్లికట్టు చూస్తున్న వ్యక్తిపై ఎద్దులు దాడి చేయడంతో మృతి చెందాడు.
ఇక తమిళనాడులో జల్లికట్టు సందర్భంగా ఇద్దరు మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఓ వైపు ప్రాణాలు పోతున్నా.. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టును ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. తమిళనాడులో ఈ క్రీడను అక్కడి ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే.