News

అక్రమంగా తరలిస్తున్న పశువులు స్వాధీనం

4views

శ్రీకాకుళం జిల్లాలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నారాయణవలస సంత నుంచి విశాఖపట్నం వైపు అనుమతి లేకుండా తరలిస్తున్న గోవుల వాహనాన్ని నరసన్నపేట పోలీసులు  పట్టుకుని సీజ్ చేశారు.

పోలీసుల సమాచారం మేరకు, తొమ్మిది ఆవులతో వెళ్తున్న ఓ వాహనం ఎవరికి అనుమానం రాకుండా గడ్డెయ్యపేట మార్గంగా శివరాంపురం వద్ద జాతీయ రహదారిపైకి చేరే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ గణేష్‌ మరియు సిబ్బంది అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు బయటపడింది. వెంటనే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ గణేష్‌ మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. జంతు సంక్షేమ నిబంధనలు ఉల్లంఘిస్తూ పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న గోవులను భద్రతా చర్యల నడుమ సమీప గోశాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.