దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ఒక రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన్టటు పోస్ట్‌మార్టం విశ్లేషణలో తేలింది. శ్రద్ధావాకర్‌కు చెందిన 23 ఎముకలకు జరిపిన పరీక్షల ద్వారా ఈ విషయం వెల్లడైనట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసుపై జనవరి చివరి వారంలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.
అయితే గత నెలలో మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధ వాకర్ ఎముకలను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అవి శ్రద్దావేనని తేల్చారు. ఆమె ఫ్లాట్‌లో రక్తపు మరకలను కూడా పరీక్షల ద్వారా శ్రద్ధకు చెందినవిగా గుర్తించారు. శ్రద్ధ తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ శాంపిళ్ల ద్వారా కూడా పరీక్షలు జరిపి ఇద్దరి డీఎన్ఏ ఒకటిగా ఉన్నట్టు నిర్ధారించారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో 28 ఏళ్ల పూనావాలాను నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తమ ఇంటరాగేషన్‌లో శ్రద్ధావాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి అడవుల్లో విసిరేసినట్టు పూనావాలా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. పూనావాలా నుంచి రాబట్టిన సమాచారంతో శివార్లలోని అటవీ ప్రాంతాలు, మదన్‌గిరి చెరువులోనూ ఆమె శరీర భాగాలను వెతికి స్వాధీనం చేసుకున్నారు.