పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల గోధుమ పిండి కోసం కూడా అక్కడ తొక్కిసలాటలు జరిగి పలువురు గాయాల పాలయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాక్‌లోని ఓ టీవీ ఛానల్‌లో నిపుణులు అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతూ… భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకీ భారత్ శక్తిమంతం అవుతోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌పై దాడి చేసి ఆధీనంలోకి తీసుకోవచ్చని అన్నారు. కానీ… భారత్‌కు అలాంటి ఆలోచన లేదని కితాబునిచ్చారు. కొంత మంది పాక్ నేతలు ఇండియాను అణుబాంబుల పేరు చెబుతూ బెదిరిస్తున్నాయి. భారత్ కూడా అందుకు గట్టి బదులే ఇస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జర్నలిస్ట్‌తో ఆ పొలిటికల్ అనలిస్ట్ ఇంకా ఏమన్నాడంటే..
“పాక్‌లోనే పరిస్థితే భారత్‌లో ఉండి ఉంటే కచ్చితంగా పాకిస్థాన్ ఇండియాపై దాడి చేసేది. ఇప్పటికిప్పుడే ఆ దేశాన్ని సర్వనాశనం చేసేది. కశ్మీర్‌నూ లాక్కునేది. కానీ… ఇండియా మాత్రం ఇలా ఎప్పటికీ ఆలోచించదు. పాక్ రోజురోజుకీ దిగజారిపోతోంది. ఇండియా మాత్రం ఎదుగుతోంది. పాక్‌ను ఇలాంటి తరుణంలో పడగొట్టాలన్న దురాలోచన భారత్‌కు రానందుకు ముందుగా అభినందనలు చెప్పాలి. అక్కడి నేతలు ఎంతో గౌరవంగా నడుచుకుంటున్నారు. పాకిస్థాన్ నేతలు ఇది అర్థం చేసుకోవాలి”