ArticlesNews

విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు!

542views

విజయవాడ: విజయవాడ దుర్గగుడిలోని ప్రసాదాల కౌంటర్లో ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలపై.. దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి మహామండపం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. భక్తుల మనోభావాలను గాయపరిచేలా కొంతమంది సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు బాధ్యు లపై సరైన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ పాలన పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినా బాధ్యులపై కనీస చర్యలు కూడా చేపట్టకపోవడమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలు లేకపోలేదు.

దుర్గగుడిలో గత నెలలో ముగిసిన దసరా ఉత్సవాలకు భారీగా పోటెత్తిన భవానీ భక్తు లకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. కనీసం వాళ్లు పవిత్రంగా తీసుకొచ్చే ఇరుముడి బియ్యాన్ని కూడా ఆలయంలో సరైన పద్ధతిలో స్వీకరించలేదు. దీంతో ఆ బియ్యాన్ని రహదారుల పక్కనే పోసేసి భవానీలు వెళ్లిపోయారు. ఉత్సవాలు ముగిసిన పది రోజుల వరకూ ఆ బియ్యం అలాగే పడి ఉన్నాయి. వాటిని తొక్కుకుంటూనే అందరూ తిరిగారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు స్పందించి ఆ బియ్యాన్ని బస్తాల్లో మూటలుగా కట్టి మహామండపంలో వదిలేశారు. అప్పటికే వానకు తడిసిన ఆ బియ్యం ముక్కిపోయాయి. దీనిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా దీనికి బాధ్యులైన ఒక్కరి పైనా చర్యలు తీసుకున్నది లేదు. పైగా.. ఈ తప్పంతా ఒడి బియ్యం తీసుకెళ్లాల్సిన గుత్తేదారుదే అని అతనికి నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యం!

దుర్గమ్మకు సాధారణ భక్తులు సమర్పించే ఒడిబియ్యం కోసం కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారు ఖాతాలోనే ఈ ఇరుముడి బియ్యం కూడా వేసేశారు. ఆలయంలో రహదారి పక్కన పడి ఉన్న ఇరుముడి బియ్యాన్ని దసరా నుంచి పర్యవేక్షించాల్సిన ఏఈవో, సూపరింటెండెంట్, గుమస్తాలు.. ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా తమకు సంబంధం లేదన్నట్టుగా తీవ్ర నిర్లక్ష్యంగా వదిలేశారు. వీరిపై ఎలాంటి చర్యలు లేవు. తాజా ఘటనను తీవ్రంగా పరిగణించాలి.. తాజాగా ప్రసాదాల ట్రేలపై దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఘటనలో ఉన్న ఉద్యోగిపై గతంలోనూ పలు ఆరోప ణలున్నాయి. ఆలయంలోని రాజగోపురం సమీపంలో పుట్టినరోజు వేడుకలు జరిపి, కేక్ కట్ చేయడంతో ఇతనిపై గతంలోనే చర్యలు తీసుకున్నారు. కానీ.. మళ్ళీ ఇప్పుడు మరో వివాదానికి తెరతీశాడు.

వాస్తవంగా ప్రసాదాల కౌంటర్లో అతనికి విధులే వేయలేదని తెలుస్తోంది. అలాంటప్పుడు కౌంటర్లోకి ఎందుకు వెళ్లనిచ్చారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది ఏం చేస్తున్నారనేది అధికారులకే తెలియాలి. ఈ విభాగాన్ని పర్యవేక్షించే ఏఈవో సహా సిబ్బంది అందరూ దీనికి బాధ్యులే అవు తారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి.. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి