భువనేశ్వర్: ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి.. అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్ష విజయవంతంగా ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ అగ్ని-3 క్షిపణి శ్రేణిలో ఇంతకుముందు 2006 జూన్ 9న మొదటిసారిగా దీన్ని ప్రయోగించగా విఫలమైంది. ఈ క్షిపణి అణు వార్‌హెడ్ తీసుకెళ్లి.. 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. రెండో క్షిపణిని 2007లో విజయవంతంగా ప్రయోగించారు. 2008లో వరుసగా మూడోసారి ప్రయోగించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విజయవంతమైన క్షిపణి.