ArticlesNews

ఆంగ్లేయుల తలలు నరికిన సాహసి ఝాన్సీరాణి!

89views
  • నేడు జయంతి

ద్దరు యువకులు, ఒక యువతి మాట్లాడుకుంటూ గుర్రాల మీద వెళ్తున్నారు. వారి మధ్యలో మాటల పోటీ ప్రత్యక్ష గుర్రపు పందెంగా మారింది. ఒక యువకుడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు. వెంటనే ఆ యువతి కూడా అతని కంటే వేగంగా గుర్రాన్ని ముందుకు ఉరికించింది. ఆ వేగానికి గుర్రం మీద నుండి ఆ యువకుడు నేలపై పడి “మనూ” అని అరిచాడు. ఆ యువతి వెంటనే గుర్రాన్ని త్రిప్పి అతన్ని లేవదీసి తన గుర్రంపై ఎక్కించుకుంది. ఇంతలో మూడో యువకుడు అక్కడకు చేరాడు. ఆ ముగ్గురు కలిసి ఇంటికి చేరారు. గుర్రం మీద నుండి పడిన యువకుడు నానా సాహెబ్, రెండవ యువకుడు ఆయన తమ్ముడు రావు సాహెబ్, ఆ యువతే మన కథానాయకురాలు మనూభాయి.

కార్తీకమాసంలో జననం

ఉత్తప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి దగ్గరలో ఉన్న ఝాన్సీ జిల్లా కేంద్ర పట్టణంలో 1835 నవంబరు 19 వ తేదీన కార్తీకమాసంలో మనూభాయి జన్మించింది. తండ్రి మోరోపంత్ తాంబే, తల్లి భాగీరధీ భాయి. మనూభాయి 4 సం. వయస్సులోనే తల్లి మరణించింది. మనూభాయి తండ్రి చేతుల మీద పెరిగింది. గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం, కత్తి సాము, విలువిద్యలలో చిన్నప్పటి నుండి శిక్షణ పొందుతూ వుండేది. క్రీ.శ 1842 లో ఝాన్సీ రాజు గంగాధరరావుతో మనూభాయి వివాహంతో ఒక పేదింటి బాలిక ఝాన్సీ రాజ్యానికి లక్ష్మీ అయ్యింది. ఆ రోజునుండి ఆమె ఝాన్సీ లక్ష్మీ భాయిగా పిలవబడుతుంది.

భర్త మరణం

1752 లో మొగలు చక్రవర్తి ముందు మోకాలుపై కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించిన బ్రిటీషు వారు మన రాజుల్లో, ప్రజల్లో ఉండే అనైక్యతను ఆసరాగా తీసుకుని అనేక రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 1851 వ సంవత్సరంలో మహారాణి లక్ష్మీ బాయికి ఒక కుమారుడు జన్మించి మూడు నెలలలోపే మరణిస్తాడు. దీంతో భర్త గంగాధరరావుకు బాధ కలిగింది. బ్రిటీషు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ అత్యంత క్రూరమైన పరిపాలన మరింత బాధను కలిగించింది. పిల్లలు లేని రాజులు దత్తత తీసుకోరాదని, దత్తపుత్రులకు రాజ్యపరిపాలన చేసే హక్కు ఇవ్వబడదని.. అలాంటి రాజ్యాలు బ్రిటీషు వారు స్వాధీనం చేసుకుంటారని డల్హౌసీ ప్రకటించాడు. 1853లో ఝాన్సీ దంపతులు ఆనందరావు అనే బాలుడుని దత్తత తీసుకున్నారు. ఆ బాలుడుకి దామోదరరావు అని నామకరణం చేశారు. ఈ దత్తతను బ్రిటీషువారు ఆమోదించ లేదు. ఈ విచారంతో 1853 నవంబరు 21 వ తేదీన లక్ష్మీభాయి భర్త గంగాధరరావు మరణించాడు.

మగ వేషంలో వ్యూహాలు

ఒకవైపు దత్త పుత్రుడును పెంచి భర్త కోరికను తీర్చవలసిన బాధ్యత, అతి చిన్న వయస్సులో ఉన్న ఝాన్సీ లక్ష్మీ భాయి కి (17 సంవత్సరాలు) రాజ్యభారం, వీటన్నింటి కంటే అతి పెద్ద ప్రమాదం లార్డ్ డల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని కబళించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 1854 మార్చిలో డల్హౌసీ తన ఆదేశంతో దత్తత చెల్లదని, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు సామ్రాజ్యంలో విలీనం చేయాలని, రాణి కోటను విడిచిపెట్టి వెళ్లాలని, ఆమె ఖర్చులకు అయిదు వేలు భరణం ఇస్తామని చెప్పాడు. నిర్ఘాంతపోయిన లక్ష్మీభాయి నేను ఝాన్సీని వదిలే ప్రసక్తే లేదని, బ్రిటీషు సైన్యాన్ని ఎదిరించాలని నిర్ణయం తీసుకుంది. బాల్యంలో నేర్చుకున్న విద్యలను అత్యంత శ్రద్ధతో అభ్యాసం చేయడం ప్రారంభించింది. బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా మగవేశంలో తగిన ఆత్మరక్షణతో బయలుదేరి వెళ్ళి బ్రిటీషువారి పట్ల అసంతృప్తితో ఉన్న రాజులను కలిసేది. వారిలో నానాసాహెబ్, రావుసాహెబ్, ఢిల్లీ రాజు బహదూర్ షా, తాంత్యాటోపీ మొదలగు వారు ఉన్నారు.

1857న ఒక్కసారిగా తిరుగుబాటు

రహస్య సమావేశాలు, మంతనాలు జరుగుతూ ఉండేవి. దుర్మార్గులైన తెల్లవారు మోసంతో దేశాన్ని బానిసత్వంలోకి నెట్టారు. వారిని పారద్రోలి దేశ స్వాతంత్య్రాన్ని, మన హక్కులను కాపాడుకుందాం అని పిలుపు నిచ్చింది. అయితే ఆచి తూచి వేయాల్సి వచ్చేది. మే 31 వ తేదీ 1857 న ఆదివారం దేశమంతా ఒకే సారి తిరుగుబాటు చేయాలని నిర్ణయం జరిగింది. విద్యాదేవత సరస్వతి, ధనదేవత లక్ష్మీదేవిలకు గుర్తుగా కలువపువ్వు గుర్తున్న జండాను విప్లవ చిహ్నంగా ధరించి తిరుగుబాటు ప్రారంభించాలని అనుకున్నారు. అయితే విప్లవ కారులలో ఐక్యమత్యం, చిత్తశుద్ధి లేని కారణంగా మే 10 వ తేదీన మీరట్‌లో సైనికులలో తిరుగుబాటు తలెత్తింది. రాజులు, మహారాజులు, సర్థారులు, పీష్వాలు, నవాబులు, ఢిల్లీ సామ్రాట్టులు వీరే కాదు, హిందువులు, ముస్లింలు మౌల్వీలు, పురోహితులు, చివరకు మహిళలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు. సుమారు 20 నెలల పాటు ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఈ పోరాటం ఝాన్సీలో ఉన్న ఒక బ్రిటీషు అధికారిని సైనికులు చంపడంతో ప్రాంభమైంది. రాణి బ్రిటీషు స్త్రీలకు, పిల్లలకు ఆశ్రయం కల్పించింది. అనేక మంది బ్రిటీషు సైన్యాన్ని, బ్రిటీషు అధికారులలో మగవారిని తిరుగుబాటు సైన్యం చంపేసింది. సైన్యం ఢిల్లీ దిశగా కదిలింది.

ఝాన్సీ కోటపై ఎగిరిన జెండా

కోటపై ఝాన్సీ రాజ్యపతాకాన్ని ఎగురవేశారు. యుద్ధ సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. సదాశివరావు అనే వ్యక్తి రాజ్యంలో ఒక మూల తిరుగుబాటు ప్రకటించుకున్నాడు. దీంతో రాణి అక్కడకు వెళ్ళి ఆ తిరుగుబాటును అణచివేసింది. ఈ లోగా సర్ రోజ్ నాయకత్వంలో ఆంగ్లేయ సైన్యం ఝాన్సీ చేరుకుంది. 1858 మార్చి 23 న రోజ్ సైన్యం ఝాన్సీ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించింది. ఆంగ్లేయ సైన్యం విజృంభించి – ఝాన్సీ రాజ్యంలోకి చొరబడడంతో లక్ష్మీభాయి స్వయంగా ఆయుధాలు చేపట్టి పురుష వేషం ధరించి అపర దుర్గా దేవిలా యుద్ధంలో పోరాటం సాగించింది. మహిళా సైన్యం పురుషులతో సమానంగా వీరోచిత పోరాటాన్ని చూసి నర్ రోజ్ ఆశ్చర్యపోయాడు. ఝాన్సీ సైన్యం చాలా నష్టపోయింది. 5 వేల సైన్యం 5 వందలకు చేరింది. కోట పట్టు తప్పుతోంది. కొద్దిమంది యోధులను తీసుకుని శత్రు సైనికులు వరుసలను చీల్చుకుంటూ ఝాన్సీ రాణి బయటకు దూసుకుపోయింది.

బోకర్ అనే బ్రిటీషు సైన్యాధికారి తన సైన్యంతో రాణిని వెంబడించాడు. దొరకకుండా “కాల్పి” అనే గ్రామానికి చేరి రావుసాహెబ్, కల్సుకుంది. ఈ లోగా రోజ్ తన సైన్యంతో “కాల్పిని” చుట్టుముట్టాడు. రాణి అక్కడ నుండి తాంత్యాతోపేలను తన సైనికులతో తప్పించుకుని బ్రిటీషు వారికి అనుకూలుడైన గ్వాలియర్ రాజుపై తిరుగుబాటు చేసింది. సైన్యం రాణికి సహకరించడంతో ఆ రాజు ఆగ్రాకు పారిపోయి ఆంగ్లేయులను శరణు వేడాడు. 1858 జూన్ 17 న రోజంతా పూర్తిస్థాయి యుద్ధాన్ని కొనసాగించారు. రాణి సైన్యం సంఖ్యాపరంగా తక్కువే అయినప్పటికీ ఆంగ్లేయ సైన్యం ఆ రోజు మట్టి కరిచింది.

మర్నాడు 18 న జయాజీరావును రాజుగా ప్రకటించి అతని ద్వారా లొంగిపోయిన వారికి క్షమాభిక్ష పెడతామని ప్రకటింప చేసారు. దీనితో చాలా మంది సైనికులు ఆంగ్లేయులతో చేయికలిపారు. రాణి వెనుకంజ వేయలేదు. రామచంద్రరావు దేశ్ ముఖ్ తో ఇలా అంది… ఈ రోజు యుద్ధానికి చివరి రోజులా ఉంది. నేను మరణిస్తే నా కొడుకు దామోదరరావు జీవితాన్ని నా జీవితం కంటే విలువైందిగా పరిగణించండి. ఆంగ్లేయసేన కోటపై పడింది. ఏడు సంవత్సరాలు వయస్సు వున్నతన కొడుకుని వీపునకు కట్టుకుని, తన రెండు చేతులతో కత్తిని పట్టి, గుర్రపు కళ్ళెమును నోటితో పట్టుకొని సమరానికి ముందుకు దూకింది. ఆంగ్లేయుల సైనికుల తలలు తెగి నేలకు రాలి పడుతున్నాయి. ఒక ఆంగ్లేయ సైనికుడు ఆమెకు దగ్గరగా వచ్చి బల్లెం విసిరాడు అది ఆమె శరీరంలో దిగింది. అయినా వాడి తలను నేలకు రాల్చింది. ఆమె శరీరమంతా గాయలైనాయి. పిల్లవాడిని తప్పించాలని గుర్రాన్ని ముందుకు దూసింది. పిల్లవాడ్ని రామచంద్రరావు దేశముఖ్ కి అప్పగించింది.

విశ్రాంతి తీసుకునే సమయాన్ని బ్రిటీషు సైన్యం ఇవ్వలేదు. స్వర్ణరేఖా నదిని దాటుతున్న సమయంలో ఆంగ్లేయ సైనికుడు కాల్చిన తుపాకీ గుండు ఆమె కుడిభుజంలో దిగింది. ఎడమచేతి కత్తితో వాడి తలను నరికింది. వేరొక సైనికుడు విసిరినకత్తి చెంపకు తగిలింది. చెంప తెగి వేలాడింది. వెంటనే తన కత్తితో వాడి తల నరికి ఎగుర గొట్టింది. తన అంగరక్షకుడైన గుల్ మహమ్మద్, రఘునాథ సింహ, రమచంద్రరావు ల సహాయంతో పరుగు పరుగున బాబా గంగాదాస్ ఆశ్రమం చేరి మూర్చపోయింది. బాబా రాణిని గుర్తించి మంచి నీటితో ముఖాన్ని కడిగి నీరు తాగించారు. ఆమె తేరుకుని హరహర మహదేవ అని నినాదం చేసి, ఓ కృష్ణా నీ ముందు నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్పి ఆంగ్ల సైన్యానికి నా శవం కూడా దొరక్కూడదని చెప్పి కన్ను మూసింది. ఆ ఆంగ్లేయ సైనికులు అశ్రమాన్ని చేరే లోపే పవిత్ర అగ్నిజ్వాలలకు ఆమె ఆహుతైంది.

ఒక మూర్తీభవించిన మహిళగా, ఆదర్శపత్నిగా, నిష్ణాతురాలైన హిందువుగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ క్రీ.శ. 1835 నుండి 1858 వరకు అనగా 22 సంవత్సరాలు గాఢాంధాకారంలో ఒక మెరుపులాగ ప్రకాశించి మాయమైన ఆమెకు సర్ రోజ్ శత్రు సైన్యాధికారి కూడా సలాం చేసాడు. ” విప్లవ కారులందరిలో అత్యంత సాహసి అందరికంటే గొప్పసేనాపతి రాణిలక్ష్మీ భాయి ” అని అన్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి