News

నంద్యాలలో నేత్రపర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పథ సంచలన్

429views

నంద్యాల: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్వయం సేవకుల పథ సంచలన్ కార్యక్రమం నంద్యాలలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. పూర్ణ గణవేష్‌తో ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు భగవాధ్వజం వెంట,ఘోష్‌కు అనుగుణంగా అడుగులు కలుపుతూ ముందుకు సాగడం, సంఘ్ అభిమానులు వారిపై పూలవర్షం కురిపించడం చూపరులను ఆకట్టుకుంది.

అంతకు పూర్వం జిల్లా సంఘ్ చాలక్ చిలుకూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాని వక్త ప్రాంత సహకార్యవాహ యుగంధర్ మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ ఎలాంటి ప్రచారాన్ని, గుర్తింపును, పదవులను ఆశించకుండా 97 సంవత్సరాలు మౌన తపస్సు చేసిందని తెలిపారు. ప్రస్తుతం దేశ విద్రోహ శక్తులు, విఘటన వాదులు, స్వార్థపూరిత శక్తులు తరతమ భేదాలు వీడి ఏకమవుతున్నాయని, వాటిని దీటుగా ఎదుర్కోవడానికి సంఘ్ మూల సిద్ధాంతాలను లక్ష్యాలను గడప గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు.

ఇందుకు ప్రతి స్వయం సేవకుడు ప్రతిరోజు ఐదుగురిని కలిసి సంఘ్ కార్యాన్ని వివరించాలని కోరారు. సంఘ్ ప్రచారం సాధనాలైన జాగృతి, ఆర్గనైజర్, హిందూ నగారాలకు విస్తృత ప్రచారం కల్పించి అందరికీ సంఘ్ కార్యాలను తెలిసేట్టు చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో విశ్వ సంవాద్ కేంద్ర(వీఎస్‌కే), రిథమ్ యాప్‌లను అందరూ డౌన్ లోడు చేసుకొని సంఘ్ కార్యక్రమాలతో అనుసంధానం కావాలని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో 231 పూర్ణ గణవేశ్ ధారి స్వయం సేవకులు, 84 గణవేష్‌లో లేని వారు, మాతృమూర్తులు 23 మంది పాల్గొన్నారు. 196 మంది స్వయంసేవకులు పథ సంచలన్‌లో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి