
అమరావతి: పవిత్ర కృష్ణానదీ తీరం అంతటా కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక సోమవారం, పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివచ్చారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచే నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి.. దీపాలు వదిలి తమ భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. రేపు చంద్రగ్రహణం ఉండడంతో ఇవాళ చాలా మంది కార్తిక పౌర్ణమి రోజు నిర్వహించే పూజలు, గౌరీ నోములు నోచుకుంటున్నారు. కార్తిక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవం నిర్వహించేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్టు ఈవో భ్రమరాంబ తెలిపారు.
శివునికి ఎంతో పీతిపాత్రమైన కార్తికమాసం సందర్భంగా.. శ్రీశైల ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సా.6.30 గంటలకు ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుంచి ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవాన్ని ఘనంగా చేపట్టనున్నారు.