భాగ్యనగరం: ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాల దర్శకుడు అభిషేక్ అగర్వాల్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు. గత రెండు బ్లాక్‌బస్టర్‌లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.
ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్‌లు, ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.