News

అయోధ్యలో దీపోత్సవ్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

184views

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నదికి రెండు వైపులా మొత్తం 15,76,000 వేల దీపాలు వెలిగించారు. దీపోత్సవ్‌ సందర్భంగా 40 ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మందిరాలన్నింటినీ అందంగా అలంకరించారు.

బాణాసంచా కాల్చడంతో పాటు లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శించిన రామాయణం నాటకం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన మాటలు, ఆలోచనలు, పాలన ద్వారా రాముడు నేర్పిన విలువలే ‘సబ్‌‌‌‌కా సాథ్.. సబ్‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌’కు స్ఫూర్తి అని ప్రధాని తెలిపారు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే సూత్రాన్ని శ్రీరాముడి ఆదర్శాలనుంచి స్వీకరించినట్లు చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులతో భారత్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రామ్‌‌‌‌ కథా పార్క్‌‌‌‌లో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ ‘‘అయోధ్య మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమంతా దీపోత్సవాన్ని చూస్తున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌ జరుపుకుంటున్న వేళ రాముడిలాంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది” అని ఆశాభావం వ్యక్తంచేశారు.

వచ్చే పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కావాలని ఆకాంక్షించే ప్రజలకు శ్రీరాముడి ఆదర్శాలు దారి చూపిస్తాయని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు మోదీ అయోధ్యలో రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్‌ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ మంత్రులు కూడా రామ్‌లల్లాను దర్శించుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి