News

సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్

196views

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఆయనను వెంటనే రిలీజ్ చేయాలంటూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని ఎన్ఐఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

అయితే, వెంటనే ముంబై హైకోర్టు ఉత్తరువులపై స్టే ఇవ్వలేమని, అత్యవసర విచారణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. న్యాయమూర్తులు ఎంఆర్.షా, బేల.ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ కేసును విచారించనుంది. సాయిబాబా కేసు అంశాన్ని రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2017లో గచ్చిరోలి జిల్లా కోర్టు సాయిబాబాకు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.

జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబా, మరో ఐదుగురిపై 2017లో యుఏపీఏ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిబాబా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి గచ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది.